Jananayagan | తమిళనాడు సీఎం, నటుడు విజయ్ కథానాయకుడిగా, హెచ్.వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘జన నాయగన్’ చిత్రం ఎట్టకేలకు సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అయితే మొత్తం మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో దాదాపు 12 కీలక మార్పులు చేయాలని బోర్డు సూచించింది.
ఇందులో భాగంగా విజయ్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ప్రస్తావన ఉన్న డైలాగ్‌లను పూర్తిగా తొలగించాల్సి ఉంటుందని. అలాగే ‘అంబేడ్కర్ చట్టం’ అనే డైలాగ్‌ను ‘TVK చట్టం’గా మార్చాలని, ఓ పుస్తకం కవర్‌పై అంబేడ్కర్ ఉన్న విజువల్స్‌ను సవరించాలని బోర్డు స్పష్టం చేసింది. ఇక దేశభక్తికి సంబంధించిన అంశాల్లో భాగంగా భారత జాతీయ జెండా కింద పడుతున్నట్లు ఉన్న ఒక కీలకమైన షాట్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. వీటితో పాటు సినిమాలో ‘రంగనాథర్’, ‘ఓం’ అనే పదాలతో పాటు ‘ఆపరేషన్ మేలుహా’ వివరణలో వచ్చే ‘న్యూ ఇండియా’ అనే పదాన్ని మ్యూట్ చేయాల్సిందిగా పేర్కొంది.
సమాజంలో సున్నితమైన అంశాలకు సంబంధించి ఒక చిన్నారిని తగలబెడుతున్నట్లు ఉన్న విజువల్స్‌ను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో వేరే విజువల్స్ రీప్లేస్ చేయాలని బోర్డు వెల్లడించింది. అలాగే సినిమాలో ‘షీలా రాణి’ అనే పేరు ఎక్కడ వచ్చినా మార్చాలని, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన సద్దాం హుస్సేన్ ఉరితీత డైలాగ్‌ను కూడా మ్యూట్ లేదా రీప్లేస్ చేయాలని సూచించింది. వీటితో పాటు మరికొన్ని సన్నివేశాల్లో వచ్చే వివాదాస్పద పదాలను కూడా మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు ఆదేశాల జాబితాలో పేర్కొంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించగా, మమితా బైజు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మార్పులన్నింటినీ పూర్తి చేసుకుని జులై 24న ‘జన నాయగన్’ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.