సినీ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్‌కుమార్ (69) సోమవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నై వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగా గుండెపోటు రావడంతో మరణించారు. విజయ్ రంగరాజు అసలు పేరు ఉదయ్ రాజ్‌కుమార్. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘వియత్నాం కాలనీ’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ‘భైరవద్వీపం’ (1994) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
ఆయన మహారాష్ట్ర పూణేలో జన్మించారు. ఆ తర్వాత గుంటూరుకు తరలివచ్చి అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేశారు. తెలుగు, తమిళ పరిశ్రమల్లో విలన్, సహాయనటుడి పాత్రల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో ఐతే, యజ్ఞం చిత్రాలు విజయ రంగరాజుకు పేరు తెచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో కూడా ఆయనకు మంచి ప్రవేశం ఉంది. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, ఫైట్ మాస్టర్‌గా ఆయన వివిధ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. విజయ రంగరాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.