Vijay Thalapathi-venkat Prabhu Movie | కోలీవుడ్‌లోని సూపర్ హిట్ జోడీలలో విజయ్, జ్యోతికల కాంబో ఒకటి. వీళ్లిద్దరి మధ్య కెమెస్ట్రీకి ఫిదా అవని తమిళ ప్రేక్షకులు లేరు. వీరిద్దరూ కలిసి తొలిసారి ఖుషీ సినిమ చేశారు. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డుల అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే విజయ్ మార్కెట్‌ను ఓ రేంజ్లో పెంచిన సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్, జ్యోతికల కెమెస్ట్రీకి తమిళ ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇదే సినిమాను తెలుగులో పవన్, భూమిక కలిసి చేశారు. ఇక్కడ కూడా ఖుషీ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఇక ఖుషీ తర్వాత మూడేళ్లకు జ్యోతిక, విజయ్‌లు కలిసి తిరుమలై సినిమా చేశారు. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా భారీ హిట్టయింది. ఇక ఇదిలా ఉంటే ముచ్చటగా మూడో సారి ఈ జంట తెరపై కనిపించనున్నారని చెన్నై టాక్. కాకపోతే హీరో హీరోయిన్లుగా కాదు. ప్రస్తుతం విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో జ్యోతిక కీలకపాత్ర పోషించనుందట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని టాక్. కాగా తిరుమలై తర్వాత దాదాపు 20ఏళ్లకు వీళ్లద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు.
ఇక విజయ్ మరోవైపు లియో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా పండుగను లాక్ చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై భారీ అంచనాలే నెలకొల్పాయి. సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది. ఇక జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె మమ్ముట్టితో కలిసి నటించిన కాథల్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. దీనితో పాటుగా హిందీలో శ్రీ, బ్లాక్ మేజిక్ సినిమాలు చేస్తుంది.