విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (గోట్)పై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. విజయ్ తమిళ రాజకీయాల్లోకి ఎంటరైన నేపథ్యంలో ఈ సినిమానే అతని చివరి సినిమా అనే ప్రచారం కారణంగానే ఈ హైప్. ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు కూడా ‘గోట్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకట్‌ప్రభు దర్శకుడు. కల్పాతి అఘోరం, కల్పాతి గణేశ్, కల్పాతి సురేశ్ నిర్మాతలు.
సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని శనివారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. గూండాలను గన్‌తో కాలుస్తూ పవర్‌ఫుల్‌గా విజయ్ ఈ లుక్‌లో కనిపిస్తున్నారు. విజయ్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయేలా ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.