Vijay | తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ (Jana Nayagan). ఇదే సినిమాను తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రాజకీయాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న విజయ్‌కు ఇదే లాస్ట్ సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే ఈ వేడుకను భారత్‌లో కాకుండా మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఈవెంట్‌కు దేశవిదేశాల నుంచి విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈవెంట్లో విజయ్ స్టేజ్‌పైకి రాగానే అభిమానులు ‘టీవీకే.. టీవీకే’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై విజయ్ కాస్త అసహనం వ్యక్తం చేస్తూ, ఇది సినిమా ఫంక్షన్ అని, ఇక్కడ రాజకీయాల ప్రస్తావన వద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటలు చెప్పిన విధానం అభిమానులను ఆలోచింపజేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు, కొంతమంది అభిమానులు టీవీకే పార్టీ జెండాలతో ఈవెంట్ ప్రాంగణంలోకి రావడానికి ప్రయత్నించగా, మలేషియన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.
‘జన నాయగన్’ సినిమా తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, మమిత బైజు విజయ్ కూతురు పాత్రలో కనిపించనుంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు భారీ హిట్‌గా నిలిచాయి.మొత్తంగా, విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రాజకీయ ప్రయాణానికి ముందు విజయ్ ఈ సినిమాతో అభిమానులకు ఎలాంటి గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తాడో చూడాల్సిందే.