 
                                                            Vijay Son | టాలెంట్ ఉన్నా కూడా లక్ కొంచెం కూడా కలిసిరాని హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, కెరీర్‌ను నిలబెట్టే పెద్ద హిట్ మాత్రం ఇంకా ఆయన ఖాతాలో పడలేదు. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు హిట్స్‌గా నిలిచినా, ఆయనకు కావాల్సిన క్రేజ్ మాత్రం రాలేదు. అయినప్పటికీ సందీప్ పట్టు వదలకుండా, కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. గతేడాది విడుదలైన మజాకా సినిమా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా కూడా సందీప్ కిషన్ నిరుత్సాహపడకుండా, కొత్త దిశగా ముందుకు సాగుతున్నాడు.
ఇప్పుడు ఆయన కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ టర్న్ రాబోతోంది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు సంజయ్ విజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఒక బైలింగ్వెల్ మూవీ (తెలుగు – తమిళ్) చేయబోతున్నారు. సంజయ్ డైరెక్షన్లో ఇది తొలి సినిమా కావడం విశేషం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చినట్టే, ఇప్పుడు దళపతి విజయ్ తనయుడు సంజయ్ కూడా డైరెక్టర్‌గా సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కోలీవుడ్‌లో ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది.
సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడో జరిగినప్పటికీ, షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. సమాచారం ప్రకారం, విజయ్ రాజకీయ కార్యక్రమాలు, ఇటీవల పార్టీ మీటింగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనల వల్ల సినిమా లాంచింగ్ కొంత వాయిదా పడిందట. అయితే సంజయ్ – సందీప్ కిషన్ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో సందీప్ కిషన్, దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ‘పవర్ పేట’ పేట గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. తెలుగులో సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సందీప్, తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన ధనుష్ రాయన్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. దీంతో తమిళ ప్రేక్షకుల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఏర్పడింది. అయితే సంజయ్‌తో చేసే ఈ సినిమా ద్విభాషా ప్రాజెక్ట్ కావడంతో, సందీప్ కిషన్‌కు తమిళ్ మార్కెట్లో పెద్ద బ్రేక్ దక్కే అవకాశం ఉంది. కోలీవుడ్ వర్గాల ప్రకారం, సంజయ్ – సందీప్ కిషన్ మధ్య మంచి స్నేహం కూడా ఉందట. అందుకే తన తొలి సినిమా కోసం ఆయనను హీరోగా ఎంచుకున్నాడని తెలుస్తోంది.
 
                            