Puri Jagannadh – Radhika| టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరిసేతుపతి అంటూ ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి టబు ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో కథానాయిక పేరు వినిపిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాధికా విజయ్‌కి జోడిగా నటిస్తుందా లేదా విలన్ పాత్రలో నటిస్తుందా తెలియాల్సి ఉంది.
దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని సమాచారం. 2012లో ధోని చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టిన రాధికా ఆప్టే ఆ తర్వాత కబాలి, బాలకృష్ణ లెజెండ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.