రవ్వంత సేవ చేస్తే దాని గురించి కొండంత ప్రచారం చేసుకునే రోజులివి. సేవ కంటే ప్రచార ఆర్భాటానికి పెద్దపీట వేసే సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. అలాంటిది లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించి..ఆ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడా పెదవి విప్పలేదు విలక్షణ తమిళ నటుడు విజయ్ సేతుపతి. పాండిచ్చేరి కేంద్రంగా నడిచే ‘వల్లల్లార్ వేలై వైపు ఇయక్కమ్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా విజయ్ సేతుపతి దాదాపు లక్షమంది యువతీయువకులు ఉద్యోగాలు పొందడానికి తోడ్పాటునందించారు. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి, సామాజిక కార్యకర్త వీరరాహవన్ వెల్లడించారు. ఉపాధ్యాయుడిగా పనిచేసే ఆయన వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగాల విషయంలో సహకారాన్ని అందించేవారు. వారికి ఓ మార్గదర్శిలా వ్యవహరించేవారు.
ఈ క్రమంలో ఆయన కొన్నేళ్ల క్రితం విజయ్ సేతుపతి ప్రయోక్తగా వ్యవహరించిన ‘నమ్మ ఊరు హీరో’ అనే టెలివిజన్ షోలో పాల్గొన్నారు. వీరరాహవన్ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న విజయ్ సేతుపతి తాను అండగా ఉంటానని మాటిచ్చారు. వీరరాహవన్ చేత టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేయించి పాండిచ్చేరిలో ‘వల్లల్లార్ వేలై వైపు ఇయక్కమ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నెలకొల్పడానికి సహాయం చేశారు. గత నాలుగేళ్లుగా ఆఫీసు నిర్వహణతో పాటు అక్కడ పనిచేసే ఉద్యోగులకు కూడా విజయ్ సేతుపతి సొంత డబ్బులతో జీతాలు అందిస్తున్నారు. ఈ సంస్థ సహకారంతో పాండిచ్చేరి ప్రాంతంలో దాదాపు లక్షమంది యువత ఉద్యోగాలు పొందారని వీరరాహవన్ తెలిపారు. ‘విజయ్ సేతుపతి సహకారంతో అసాధ్యమనుకున్న లక్ష్యాల్ని సాధించాం. ఆయన లక్ష కుటుంబాల్లో వెలుగు నింపారు. తాను చేస్తున్న సేవ గురించి విజయ్ సేతుపతి ఎక్కడా చెప్పుకోలేదు’ అని వీరరాహవన్ ఆనందం వ్యక్తం చేశారు.