Vijay Sethupathi | టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టీజర్ కోసం నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి డబ్బింగ్ పూర్తి చేసినట్లు పూరీ జగన్నాథ్ శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ అప్డేట్లో అసలు విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి కేవలం ఒక భాషలోనే కాకుండా ఏకంగా మూడు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ) స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ, విజయ్ సేతుపతి తన సొంత వాయిస్‌తో మూడు భాషల టీజర్‌కు అద్భుతమైన వాయిస్‌ను అందించారని, ఈ చిత్ర టీజర్‌ను జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
గతేడాది జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిగా ముగిసిందని, ప్రస్తుతం అన్ని భాషలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. గతంలో విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో విజయ్ సేతుపతి స్టైలిష్ గాగుల్స్ ధరించి, చేతిలో రక్తం అంటిన కత్తితో, కరెన్సీ నోట్ల పెట్టెల మధ్య నిలబడి ఉన్న లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ మోషన్ పిక్చర్స్ భాగస్వామ్యంతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఎంతో బలంగా ఉంటాయని సమాచారం. హీరోయిన్ సంయుక్త పాత్ర ఎమోషనల్ గా, నటనకు మంచి స్కోప్ ఉన్నదిగా ఉంటుందని, ఈ పాత్ర పట్ల ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.