సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2) నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్లో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను ఆయనే స్వయంగా ధృవీకరించారు. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తాను ఈ చిత్రంలో ఒక కీలక అతిథి పాత్ర (Cameo) పోషిస్తున్నట్లు వెల్లడించారు.
రజనీకాంత్ అంటే తనకు ఉన్న అపారమైన అభిమానం వల్లే ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు విజయ్ సేతుపతి పేర్కొన్నారు. “రజనీ సార్‌తో కలిసి పని చేయడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న ఆయన అనుభవం నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసమే ఈ పాత్రను అంగీకరించాను” అని ఆయన తెలిపారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘పెట్టా’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ‘జైలర్ 2’లో విజయ్ సేతుపతి పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉంటుందని ఫిలిం నగర్ టాక్.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే శివరాజ్ కుమార్, మోహన్ లాల్, ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి వంటి దిగ్గజ నటులు భాగమైనట్లు సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ మళ్ళీ ఏ రేంజ్లో గర్జించబోతున్నారో అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Vijay Sethupathi cameo in #Jailer2 🥵 pic.twitter.com/gusC7cPjAx
— OTT Trackers (@OTT_Trackers) January 15, 2026