Vijay-Rashmika | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహంపై ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ జంట రిలేషన్షిప్ గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నప్పటికీ, తాజాగా ఈ చర్చలకు మరో ఆసక్తికర అంశం జతకావడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈసారి పెళ్లి వార్తలకు ఊపిరి పోసింది ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన.విజయ్–రష్మిక వివాహ వేడుకను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టార్ జంట పెళ్లికి అత్యుత్తమ నాణ్యత గల డచ్ గులాబీలను కానుకగా పంపించనున్నట్లు ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ బొల్లేపల్లి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన విజయ్, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి జీవితంలో ఈ ముఖ్యమైన ఘట్టాన్ని మరింత అందంగా మలచేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.వారి వివాహ వేడుకకు మా సంస్థ తరఫున ప్రత్యేకమైన డచ్ గులాబీలను అందిస్తున్నాం. ఈ పూలు వారి జీవితంలోని మధురమైన క్షణాలను మరింత అందంగా మార్చాలని ఆకాంక్షిస్తున్నాం” అని శ్రీకాంత్ బొల్లేపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో విజయ్–రష్మిక పెళ్లి వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఈ జంట వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రహస్యంగా నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. అయితే ఆ విషయాన్ని విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన్న గానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం జరగనుందన్న ప్రచారం మరోసారి సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఈ ప్రకటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని అభిమానులు భావిస్తున్నారు.