LTTE chief Prabhakaran | శ్రీలంక అంతర్యుద్ధం(Civil War)లో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది తమిళులను స్మరించుకుంటూ జరుపుకునే ముల్లివైకల్ స్మరణ దినోత్సవం (Mullivaikkal Remembrance Day) సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ శ్రీలంక తమిళులకు తన గట్టి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ముల్లివైకల్ సంబంధించిన చేదు జ్ఞాపకాలు, ఆనాటి మారణహోమం సృష్టించిన గాయాలు మన హృదయాలలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. సముద్రం అవతల నివసిస్తున్న మన తమిళ బంధువుల హక్కుల కోసం, వారి న్యాయమైన పోరాటాల కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం’ అని విజయ్ స్పష్టం చేశారు.
శ్రీలంక అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ 2009 మే 18న ఎల్టిటిఇ (LTTE) వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ముల్లివైకల్ తీరంలో హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే, ఆ యుద్ధంలో ముల్లివైకల్ గ్రామంలో దారుణంగా ఊచకోతకు గురైన, అదృశ్యమైన వేలాది మంది అమాయక తమిళ పౌరుల జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 18ని ప్రపంచవ్యాప్త తమిళ సమాజం ‘ముల్లివైకల్ స్మరణ దినోత్సవం’గా పాటిస్తోంది. దాదాపు 26 ఏళ్ల పాటు సాగిన ఈ రక్తపాతంలో ప్రాణాలు కోల్పోయిన తమ బంధువులకు నివాళులర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.