ఏ కథలోనైనా చక్కగా ఒదిగిపోతాడు యువహీరో విజయ్ దేవరకొండ. ఇక ప్రేమకథల గురించి చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్‌రెడ్డి’ ‘గీతగోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ వంటి ప్రేమకథా చిత్రాలు విజయ్‌దేవరకొండకు యువతరంలో తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన పూరిజగన్నాథ్ దర్శకత్వంలో పాన్ఇండియా యాక్షన్ చిత్రం ‘లైగర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వం వహించే సినిమాల్లో విజయ్ దేవరకొండ నటించనున్నారు. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ ఓ ప్రేమకథా చిత్రానికి ఓకే చేశారని వినిపిస్తోంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన ఎమోషనల్ లవ్‌స్టోరీ విజయ్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని…కథలోని హృద్యమైన అంశాలు నచ్చడంతో సినిమాకు అంగీకరించారని అంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ఇండియా స్థాయిలో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఓ నిర్ణయానికి రావొచ్చని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్‌కపూర్ కథానాయకుడిగా హిందీలో రీమేక్ చేస్తున్నారు.