‘మీ అభిమానం దేవుడిచ్చిన వరం. హిట్ అయినా, ఫ్లాప్ అయినా నాపై అదే ప్రేమ. నా హిట్ కోసం ఇండస్ట్రీలో కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. నా విజయాన్ని కోరుకుంటున్న మీ అందరికోసం వ్యక్తిగతంగా కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది. ఇకనుంచి మీ గౌరవాన్ని పెంచే సినిమాలే చేస్తా. మీ కోసం ప్రాణం పెట్టి సినిమాలు చేస్తా’ అని అభిమానులను ఉద్ధేశించి విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ క్రియేషన్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘మొన్న ఫ్యాన్స్‌మీట్‌లో రెండువేల మంది నన్ను కలిశారు. ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నామన్నా..మనం టాప్‌లో కూసుంటామన్నా.. నువ్వు కాదు మనం కొడుతున్నాం’ అని అభిమానులు చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చింది.
అందుకే నా శక్తి ఉన్నంతవరకు పనిచేస్తూ మీ అందరి జీవితాల్లో ఏదో ఒక అవసరం కోసం నా తరపున కాంట్రిబ్యూట్ చేస్తా. అది నా బాధ్యత. ఇక సినిమా విషయానికొస్తే.. ఇది గౌతమ్ తిన్ననూరి సినిమా. ఇప్పటికీ ఆయన సినిమా పనిమీదే ఉన్నారు. మంచి సినిమా ఇవ్వాలనే కసితో పనిచేస్తున్నారు. ఇక అనిరుధ్ తన మ్యూజిక్‌తో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. నవీన్నూలి తన ఎడిటింగ్‌తో సినిమాకు ప్రాణం పోసి మంచి ప్రొడక్ట్ ఇచ్చారు. భాగ్యశ్రీబోర్సే, సత్యదేవ్, వెంకటేష్ అద్భుతంగా నటించారు. మొత్తంగా ఇది నిర్మాత నాగవంశీ కింగ్డమ్. ఇంకా రెండ్రోజులే ఉంది. కాస్త టెన్షన్‌తో పాటు మంచి సినిమా తీశామనే సంతృప్తి కూడా ఉంది. విజయంపై నమ్మకంతో ఉన్నాం ’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషించిన సత్యదేవ్ మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండ గొప్ప హ్యూమన్ బీయింగ్. ఒక్కొక్క మెట్టూ ఎక్కి ఈ ‘కింగ్డమ్’ని సృష్టించుకున్న విజయ్‌ని చూస్తుంటే గర్వంగాఉంది. తను దేవరకొండ కాదు.. బంగారుకొండ.’ అన్నారు. ఇంకా కథానాయిక భాగ్యశ్రీబోర్సే, నిర్మాత నాగవంశీ, అనిరుధ్ రవిచందర్, కోన నీరజా, వెంకటేష్, అవినాష్ కొల్లాతదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.