Vijay Devarakonda | అగ్ర హీరో విజయ్ దేవరకొండ సినిమాల వేగాన్ని పెంచాడు. ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఓ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచింది. 1854 నుంచి 1878 మధ్య జరిగే కథ అని పోస్టర్ మీద పేర్కొనడంతో ఈ సినిమా ఇతివృత్తం గురించి ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలిసింది. రాహుల్ సంకృత్యాన్ గత చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’లో నాని డ్యూయల్ రోల్‌ను పోషించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో సైతం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డ్యూయల్ రోల్లో హీరో పాత్రను డిజైన్ చేశారని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.