విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘విధి పిలిచింది. రక్తపాతం ఎదురుచూస్తోంది’ అనే క్యాప్షన్‌తో గతంతో విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాకు సంబంధించిన న్యూ అప్డేట్ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నామని తెలిపారు. ‘స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలనుకున్నాం. ప్రొడక్షన్ మధ్యలో తీసుకున్న నిర్ణయం కాదిది. అయితే రెండు భాగాల్లో కథ పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’ అని ఆయన తెలిపారు. ఈ సినిమాతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురాబోతుండటంతో విజయ్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.