Kushi Movie | అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న ‘ఖుషీ’ షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలవబోతుంది. సమంత కారణంగా ఇన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన మూవీ మార్చి 8 నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ షెడ్యూల్‌కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని వినికిడి. రెండు, మూడు నెలలు కాదు ఏకంగా అర్ధ సంవత్సరం షూటింగ్ ఆగిపోయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇపాటికే సినిమా విడుదలయ్యేది కూడా. కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
ఇక నిర్విరామంగా షూటింగ్ జరపాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దానికి తగ్గట్లే చిత్రయూనిట్ పక్కాగా ప్లాన్ చేసుకుంటుందట. సామ్ కూడా అడిగినన్ని డేట్స్ ఇచ్చేసిందట. రెండు నెలలో షూటింగ్ పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం వెకేషన్ టూర్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ రేపో, ఎల్లుండో ఇంటికి చేరుకోనున్నాడు. సమంత కూడా ప్రస్తుతం జరుగుతున్న సిటాడెల్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి ముస్తాబవుతుంది.
రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై కాస్త అంచనాలు పెంచాయి. కాశ్మీర్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ ప్రేమ కావ్యానికి హేషమ్ అబ్దుల్ వాహద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.