Vijay Devarakonda Multistarrer | ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘లైగర్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్‌కు సరిపడా కలెక్షన్లు కూడా రాలేవు. ఇక రిలీజైన వారంలోపే ఈ చిత్రం దుకాణం సర్దేసింది. ఈ సినిమా ఫలితం విజయ్ను తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఆయన కల.. కల గానే మిగిలిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు.
సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రౌడి బాయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ఓ మలయాళ సినిమాకు ఓకే చెప్పాడట. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించనున్న ‘వృషభ’ సినిమాలో విజయ్ ఓ కీలకపాత్ర పోషించనున్నాడట. ఈ చిత్రంలో విజయ్.. మోహన్‌లాల్ కొడుకుగా కనిపించనున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తండ్రి, కొడుకుల డ్రామాగా తెరకెక్కనుందట. ఏవీఎస్ స్టూడీయోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లో రూపొందనుందట. ప్రేమ, ప్రతీకారం వంటి రెండు భావోద్వేగాల మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ కథ సాగనుందట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.