అగ్ర హీరో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’ (వర్కింగ్ టైటిల్) చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. కోనసీమ నేపథ్యంలో సాగే ఈ రూరల్ యాక్షన్ డ్రామాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది.
ఈ నెల 22న టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం డైరెక్టర్ నోట్ పేరిట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో దర్శకుడి దృక్కోణంలో హీరో పాత్రను, అతని గతాన్ని పరిచయం చేశారు. ‘ఒక మనిషి గురించి ఎప్పటి నుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా.
నా జ్ఞాపకాల్లో అతను ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ పెరిగా. అతన్ని ఎంత ప్రేమించానో అంతే ద్వేషించాను. అతనిది అందరికీ చెప్పాల్సిన కథ. మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను.’ అంటూ దర్శకుడు వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటున్నది. రక్తమోడుతున్న విజయ్ దేవరకొండ చేతిని చూపిస్తూ ప్రోమోను ముగించిన తీరు కథపై ఆసక్తిని పెంచేలా ఉంది.