టాలీవుడ్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ఒకటి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాల వల్ల ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. వేసవి కానుకగా మే 30న పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్నందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ‘కింగ్డమ్’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లో ఆయన జాయిన్ అవుతారని సమాచారం. అనిరుధ్ నేపథ్య సంగీతం తోడైతే సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. భాగ్యశ్రీబోర్సే ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.