విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘లైగర్’ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ద్వయం ‘జనగణమన’(జేజీఎమ్) పేరుతో మరో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టారు. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా మంగళవారం ముంబయిలో లాంఛనంగా ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియో ప్రొడక్షన్ పతాకాలపై ఛార్మికౌర్, వంశీపైడిపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారి పాత్రను పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘దేశభక్తి, యుద్ధం నేపథ్యంలో నడిచే కథ ఇది. దేశ పౌరుల శ్రేయస్సు కోసం తపించే నిజాయితీపరుడైన సైనికుడిగా విజయ్ దేవరకొండ పాత్ర శక్తివంతగా సాగుతుంది. దేశభక్తి భావనలతో ప్రజల్లో స్ఫూరినింపే కథాంశమిది. ఆర్మీ అధికారి అయిన హీరో జేజీఎమ్ పేరుతో ఓ ఆపరేషన్‌ను చేపడతాడు. అందుకే అదే పేరుతో టైటిల్ పెట్టాం’ అన్నారు. భారీ హంగులతో పాన్ ఇండియా మూవీగా రూపొందించబోతున్నామని, యుద్ధ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత ఛార్మి చెప్పింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘సైనికుడి పాత్రను పోషించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ప్రతి భారతీయుడి హృదయాన్ని స్పృశించే కథ ఇది. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. ప్రతి భారతీయుడిలో స్ఫూర్తినింపే చిత్రమిదని నిర్మాతల్లో ఒకరైన వంశీ పైడిపల్లి తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభంకానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.