Vijay | తమిళనాట స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) రాష్ట్రవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అవుతోంది. విజయ్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తుండగా, ఇటీవల మధురైలో నిర్వహించిన రెండవ రాష్ట్ర స్థాయి సమావేశం మాత్రం రికార్డులు నెలకొల్పింది. మధురైలో జరిగిన ఈ బహిరంగ సభకు రికార్డ్ స్థాయిలో ఒక కోటి 40 లక్షల (14 మిలియన్లు) మంది ప్రజలు హాజరైనట్టు TVK వర్గాలు చెబుతున్నాయి. ఎన్ని అంచనాలు వేసుకున్నా కూడా, ఈ స్థాయిలో ప్రజలు చేరడం తమిళనాడు రాజకీయాల్లో గమనించదగ్గ పరిణామం.
ఇక ఈ సభ సందర్భంగా విజయ్ తీసిన సెల్ఫీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోకు మొత్తం 10.3 మిలియన్ల (కోటికి పైగా) లైక్స్ వచ్చాయి. దక్షిణ భారత నటుల్లో ఒక పోస్ట్‌కి ఇంత భారీ స్థాయిలో లైక్ రావడం ఇదే తొలిసారి. విజయ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పెరిగి, కోటిన్నర ఫాలోవర్లు దాటింది. విజయ్ ప్రస్తుతం తను నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయకన్’ షూటింగ్లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పి, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపున పోటీకి సిద్ధమవుతున్నాడు. రాజకీయంగా ఆయన యాత్ర ఇప్పటికే ఉత్సాహంగా సాగుతుండగా, రాజకీయాలలో కూడా అతడికి మంచి భవిష్యత్తు ఉండొచ్చనే అభిప్రాయాలు వెల్లివిరుస్తున్నాయి.
విజయ్ మీటింగులకు వస్తున్న ప్రజలతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఏర్పడుతున్నాయి. వాహనాలు నిలిపే స్థలాల నుంచీ, సభ వరకు ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు చెమటోడ్చాల్సి వస్తుంది. విజయ్ ప్రస్తుతం తమిళనాడులో రాజకీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్. సినీ అభిమానులే ఓటర్లుగా మారుతూ , ఆయన్ని నాయకుడిగా చూడాలనే ఉత్సాహం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి 2026లో ఈ అభిమానాన్ని ఓట్లుగా మలచి విజయ్ కొత్త చరిత్ర సృష్టిస్తాడా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.