విజయ్ ఆంటోని, స్వాసిక జంటగా నటిస్తున్న చిత్రం ‘వంద దేవుళ్లు’. రైతు నేపథ్య కథాంశమిది. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు నిహారిక కొణిదెల, త్రినాథరావు నక్కిన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ‘బిచ్చగాడు’ సినిమాతో దర్శకుడు శశి తనకు కొత్త జీవితాన్నిచ్చాడని, ఆ సినిమా తరహాలోనే ‘వందదేవుళ్లు’ భావోద్వేగభరితంగా సాగుతుందని, ఈ కథ విని కన్నీళ్లను ఆపుకోలేకపోయానని విజయ్ ఆంటోని అన్నారు.
‘బిచ్చగాడు’ కంటే గొప్పగా చిత్రాన్ని తీశారని నిహారిక కొణిదెల ప్రశంసించింది. “తల్లీకొడుకుల కథ ఇది. ‘బిచ్చగాడు’ కథకు పూర్తి భిన్నంగా ఉంటుంది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది’ అని దర్శకుడు శశి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బాలాజీ శ్రీరామ్, నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి, దర్శకత్వం: శశి.