Vijay Antony | తమిళ స్టార్ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. విభిన్న కథలు, విలక్షణమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆయన, భవిష్యత్తులో సినిమాలకు దూరమయ్యే సూచనలు చేశారు. మరో మూడేళ్లలో చెన్నై నగరాన్ని శాశ్వతంగా వీడి గ్రామీణ ప్రాంతంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. విజయ్ ఆంటోనీ హీరోగా, దర్శకుడు శశి తెరకెక్కించిన ‘పిచ్చైకారన్’ (తెలుగులో ‘బిచ్చగాడు’) చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘నూరు సామి’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీడియాతో మాట్లాడిన విజయ్ ఆంటోనీ, తాను ఎప్పటి నుంచో సున్నితమైన జీవన విధానాన్ని ఇష్టపడతానని చెప్పారు. నా వృత్తి కారణంగా ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నాను. కానీ నగర జీవితానికి నేను పెద్దగా ఆకర్షితుడిని కాదు. ప్రశాంతమైన, సాధారణ జీవితం గడపాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబు నగర జీవితం నుంచి బయటకు వచ్చి గ్రామంలో స్థిరపడిన విధానం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నేనూ అదే తరహాలో జీవించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. తాజా చిత్రం ‘నూరు సామి’ షూటింగ్ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో గడిపిన అనుభవాలను కూడా విజయ్ ఆంటోనీ గుర్తుచేసుకున్నారు. మా సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం కల్లకురూచి ప్రాంతంలో జరిగింది. అక్కడి ప్రజల ఆప్యాయత, సహజమైన జీవన విధానం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేటి కాలంలో చాలామంది గ్రామాల నుంచి నగరాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. కానీ నాకు మాత్రం గ్రామాల్లోనే అసలైన ఆనందం కనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం, మనుషుల మధ్య ఉన్న ఆత్మీయత నగరాల్లో దొరకవు అని పేర్కొన్నారు.
విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పబోతున్నారా? అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత సినిమాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆయన నేరుగా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా, మూడేళ్లలో గ్రామీణ జీవనానికి మారిపోతానన్న వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ‘బిచ్చగాడు’ కాంబినేషన్లో వస్తున్న ‘నూరు సామి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శశి, విజయ్ ఆంటోనీ కలయికలో మరో భావోద్వేగభరితమైన కథ ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 19న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.