విజయ్ సేతుపతి అతిథి పాత్రలో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘విడుదల 1’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘విడుదల 2’ రానుంది. ఈ సెకండ్ పార్ట్‌లో విజయ్ సేతుపతే కథానాయకుడు కావడం గమనార్హం. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. శ్రీవేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్ సేతుపతి చెన్నైలో విడుదల చేశారు. విజయ్ సేతుపతి ఇందులో ‘పెరుమాళ్’ అనే పాత్ర పోషిస్తున్నారని, పెరుమాళ్ అనే సామాన్యుడు పోరాట యోధుడిగా ఎలా మారాడనేది ఈ కథ ప్రధానాంశమని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ అన్నీ రియాలిటీగా ఉంటాయని, ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ అని, ఏడు నేషనల్ అవార్డులు గెలిచిన ఏకైక దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని నిర్మాత చింతపల్లి రామారావు నమ్మకం వ్యక్తం చేశారు. మంజు వారియర్, సూరి, భవానిశ్రీ, గౌతమ్ వాసుదేవమీనన్, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మీనన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వేల్ రాజ్.