Chhaava| ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఛావా సినిమా కొద్ది రోజుల క్రితం బాలీవుడ్లో విడుదలై మంచి హిట్ అయింది. ఈ సినిమా దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ చిత్ర పరిశ్రమలోని అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో టాప్ 25లో నిలిచింది. సులువుగా వెయ్యి కోట్లు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందీలో సినిమా పెద్ద హిట్ కావడంతో మూవీని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయాలని మూవీ రైట్స్ అల్లు అరవింద్ దక్కించుకున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా, చిత్రానికి డీసెంట్ బుకింగ్ నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది. హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదల కాబోతున్నా కూడా మూవీని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఛావా తెలుగు వర్షన్‌ను రిలీజ్ చేయబోతున్నారు.అయితే మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఏపీలోని ముస్లీం ఫెడరేషన్ నాయకులు ఇటీవల నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఛావా సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఛావా సినిమా కారణంగా ఉత్తర భారతంలో చాలా చోట్ల గొడవలు జరిగాయని, ఏపీలోనూ అలాంటి మత ఘర్షణలకు అవకాశం ఉంది కనుక సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని ఏపీ ముస్లీం ఫెడరేషన్ అధ్యక్షుడు జియా ఉల్ హకీ డిమాండ్ చేస్తున్నాడు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే ఛావా సినిమా ఇక్కడ రిలీజ్ కాకూడదు అని ఆయన అంటున్నాడు. ఈ సినిమాపై నిషేధం విధించని పక్షంలో ముస్లిం సంఘాల నేతలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మార్చి 7న ఛావా రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.