‘ఛావా’ చిత్రంలో మహారాణి యేసుబాయి పాత్రను పోషించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, ఇలాంటి పాత్ర చేసిన తర్వాత ఇక తాను సినిమాల నుంచి రిటైర్ అయినా సంతోషమేనని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. మరాఠీ యోధుడు ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఛావా’ చిత్రంలో ఆమె మహారాణి యేసుబాయి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీగా కనిపించనున్నారు. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ముంబయిలో ట్రైలర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ ‘నా కెరీర్ అత్యంత విశిష్టమైన పాత్ర ఇది. ఇలాంటి పాత్ర దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఓ నటిగా నాకు ఇంతకుమించి ఏం కావాలి?. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలాసార్లు భావోద్వేగానికి గురయ్యా. ఒక్కోసారి కన్నీళ్లొచ్చేవి. ఈ సినిమాలోని పాత్రలు ప్రతీ ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి’ అని రష్మిక మందన్న చెప్పింది.
జిమ్ వర్కవుట్స్ సందర్భంగా ఇటీవల రష్మిక మందన్న కాలికి గాయమైన విషయం తెలిసిందే. ‘ఛావా’ ట్రైలర్ రిలీజ్ వేడుకకు ఆమె గాయంతోనే హాజరయ్యారు. వేదికపై రష్మిక నడవడానికి విక్కీ కౌశల్ సాయం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ‘ఛావా’ చిత్రం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.