NTR | సామాజిక స్పృహ, సహజత్వం కలబోసిన రా అండ్ రస్టిక్ సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్రతో సాగిపోతున్నారు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్. ఇక తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు పొందారు అగ్ర హీరో ఎన్టీఆర్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కార్యరూపం దాల్చితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా చెన్నైలో నిర్వహించిన ‘దేవర’ ప్రచార కార్యక్రమం ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబినేషన్ సినిమా గురించి మరోమారు చర్చకు తెరతీసింది.
తమిళంలో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? అది ఏ దర్శకుడితో? అని వ్యాఖ్యాత ఎన్టీఆర్‌ను అడగ్గా…తమిళంలో వెట్రిమారన్ తన ఫేవరేట్ దర్శకుడని, ఆయనతో సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని ఎన్టీఆర్ చెప్పారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ గురించి మరోమారు చర్చలు మొదలయ్యాయి. అయితే నాలుగేళ్ల క్రితమే ఎన్టీఆర్‌తో వెట్రిమారన్ సినిమా చేయబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. లాక్డౌన్ తర్వాత తాను ఎన్టీఆర్‌కు స్టోరీ చెప్పానని వెట్రిమారన్ ఓ సందర్భంలో చెప్పారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ తాజా వ్యాఖ్యలతో ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.