Actress Pushpalatha | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తెలుగు, తమిళ సీనియర్ నటి పుష్పలత (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పుష్పలత చెన్నైలోని తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబీకులు వెల్లడించారు. పుష్పలత 1958లో ‘సెంగోట్టై సింగం’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు వందకుపైగా చిత్రాల్లో నటించారు. 1961లో కొంగునాట్టు తంగం అనే సినిమాలో హీరోయిన్గా నటించారు. నానుమ్ ఒరు పెణ్ అనే సినిమాలో నటుడు ఏవీఎం రాజన్‌కు జోడీగా నటించారు.
ఆ సినిమాతో ఇద్దరు మంచి స్నేహితులయ్యా. ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఇద్దరు సంతానం. ఒక కూతురు మహాలక్ష్మి కన్నడలో పలు చిత్రాల్లో నటించారు. పుష్పలత తెలుగులో ‘సంసారం’ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్రావు, నందమూరి తారకరామారావుతో నటించింది. ఇదే ఆమెకు తెలుగులో తొలి చిత్రం. ఆ తర్వాత పెద్దకొడుకు, మేము మనుషులమే, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం, అన్నదమ్ముల అనుబంధం, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్ రౌడీ, ఇద్దరు కొడుకులు, విక్రమ్, వేటగాడు, కాళి, ప్రేమకానుక, నువ్వే నాశ్రీమతి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నై టీనగర్‌లోని తిరుమలపిళ్లై రోడ్డులో నివాసం ఉంటున్నారు. గతకొంతకాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.