Partho Ghosh |బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు పార్థో ఘోష్ (75) గుండెపోటుతో కన్నుమూశారు. 100 డేస్, దలాల్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన మరణవార్త సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కలకత్తాలో జన్మించిన పార్థో ఘోష్ 1985లో హిందీ చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 100 డేస్. ఇందులో జాకీ ష్రాఫ్, మాధురీ దీక్షిత్, మూన్ మూన్ సేన్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పార్థోకి కెరీర్లో మైలురాయిగా నిలిచింది. అనంతరం 1993లో వచ్చిన ‘దలాల్’ చిత్రం పార్థో కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కథానాయకుడిగా నటించాడు. అలాగే నానా పటేకర్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అగ్నిసాక్షి’ (1996) విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, వాణిజ్యపరంగానూ పెద్ద విజయం సాధించింది. వీటితో పాటు ‘గులాం-ఎ-ముస్తఫా’ (1997), ‘తీస్రా కౌన్?’ (1994) వంటి చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. చివరిగా ఆయన 2018లో మౌసం ఇక్రార్ కే దో పాల్ ప్యార్ కే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
మరోవైపు పార్థో ఘోష్ మృతి పట్ల నటి రితుపర్ణ సేన్‌గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “నా హృదయం మాటల్లో చెప్పలేనంతగా బద్దలైంది. మేము ఒక మంచి ప్రతిభావంతుడిని, దార్శనిక దర్శకుడిని, మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయాము. పార్థో దాదా, మీరు తెరపై సృష్టించిన మాయాజాలం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక విశ్రాంతి తీసుకోండి” అని రితుపర్ణ సేన్ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది.