సీనియర్ తమిళ నటుడు చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చారుహాసన్ వయసు 93ఏండ్లు. అగ్రనటుడు కమల్‌హాసన్‌కి ఆయన స్వయానా అన్నయ్య. నటి సుహాసినికి తండ్రి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి చారుహాసన్‌తో తానున్న ఫొటోని రీసెంట్గా సుహాసినీ షేర్ చేశారు.
‘నాన్నకు ట్రీట్మెంట్ జరుగుతున్నది. కోలుకుంటున్నారు. డాక్టర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన మళ్లీ మనతో లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తున్నా.’ అని ఫొటోతో పాటు పేర్కొన్నారు సుహాసిని. తమ్ముడు కమల్‌హాసన్ మాదిరిగానే చారుహాసన్ కూడా జాతీయ నటుడు. వివిధ భాషల్లో మంచి పాత్రల్ని పోషించారాయన.
శుభోదయం, దళపతి, అంకురం, శాంతి-క్రాంతి, నేటి సిద్ధార్థ, మాతృదేవోభవ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చారుహాసన్ చేరువయ్యారు. చారుహాసన్ దర్శకుడు కూడా. పుదియ సంగమం, ఐపీసీ 215.. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు. ప్రస్తుతం చారుహాసన్ కోలుకుంటున్నారట. నేడో, రేపో డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం.