కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ కొన్ని సినిమాలకు మాటలు రాసినా.. ఆయన్ను డైలాగ్ రైటర్‌గా అగ్రస్థానంలో నిలబెట్టింది మాత్రం ‘నువ్వునాకు నచ్చావ్’ సినిమానే. ఆ సినిమాలో త్రివిక్రమ్ సంభాషణల్ని వెంకటేశ్ పలికిన తీరు జనం ఎన్నటికీ మరిచిపోలేరు. త్రివిక్రమ్ సంభాషణాచతురతనూ, ఆ అక్షరాల్లోని అందాన్నీ అద్భుతంగా ఆవిష్కరించారు వెంకీ. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమాను కూడా అందుకు ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ డైలాగుల్ని వెంకీ పలకనున్నారు.
అయితే.. ఈ సారి దర్శకుడు కూడా త్రివిక్రమే కావడం గమనార్హం. ఈ సినిమా పూజాకార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబకథగా ఈ సినిమా ఉంటుందని, త్రివిక్రమ్ కథాశైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేశ్‌ని చూడటం ప్రేక్షకులకు నిజంగా ఓ కొత్త అనుభవమేనని మేకర్స్ చెబుతున్నారు. ప్రతిష్టాత్మ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది.