ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏది? అని అడిగితే ఎక్కువమంది నుంచి వచ్చే జవాబు ‘నువ్వు నాకు నచ్చావ్’. ఆ కంటెంట్కున్న విలువ అలాంటిది మరి. 2001, సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా మరపురాని కుటుంబ ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే.. ఆ సినిమా పంచిన నాటి అనుభూతిని మళ్లీ నేటి తరానికి స్వచ్ఛంగా అందించేందుకు రంగం సిద్ధమైంది. ‘నువ్వునాకు నచ్చావ్’ చిత్రాన్ని పూర్తి సాంకేతిక హంగులతో 4కె లోకి కన్వర్ట్ చేసి, నూతన సంవత్సర కానుకగా 2026, జనవరి 1న విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ, తివిక్రమ్ మాటల మాయాజాలం, ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుగా దర్శకుడు విజయభాస్కర్ మలచిన తీరు.. వీటన్నింటితోపాటు సంగీత దర్శకుడు కోటి అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలబెట్టాయని చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేవలం రీరిలీజ్ మాత్రమే కాదని, నూతన సంవత్సరంలో ఆడియన్స్‌కి తామందిస్తున్న కానుకని, ఈ సినిమా మా టీమ్‌కు ఓ అద్భుతమైన అనుభవమని ఆయన చెప్పారు.