తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తరహాలోనే వెంకటేష్‌లో కూడా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌తో తనకున్న అనుబంధం, ఆయనిచ్చిన ఓ సలహా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు వెంకటేష్. కెరీర్ తొలినాళ్లలో రజనీకాంత్ ఇచ్చిన సలహాను ఇప్పటివరకు పాటిస్తున్నానని తెలిపారు. ‘రజనీకాంత్ మా నాన్నతో కలిసి పనిచేశారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనో మాట చెప్పారు.
‘సినిమా రిలీజ్ ఎంత గ్రాండ్‌గా చేశారు? పెద్ద బ్యానర్లు కట్టారా? మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజీల్లో మన ఫొటోలు వేశారా? వంటి విషయాల గురించి అస్సలు ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే జీవితంలో ప్రశాంతంగా ఉంటాం’ అని సూచించారు. ఆ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా. పబ్లిసిటీ, కలెక్షన్స్ వంటి విషయాల గురించి నేను అస్సలు పట్టించుకోను’ అని వెంకటేష్ అన్నారు. తాను దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తానని, ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివానని, అరుణాచలం సందర్శనను ఎంతగానో ఇష్టపడతానని, రమణ మహర్షిని ఆరాధిస్తానని వెంకటేష్ చెప్పారు.