Vikram| చియాన్ విక్రమ్ తమిళ హీరో అయిన తెలుగులోను ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విక్రమ్ సినిమాలని ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తుంటారు. అయితే అపరిచితుడు తరువాత మళ్లీ విక్రమ్ ఆ రేంజ్ సక్సెస్ చూడలేకపోతోన్నాడు. ఇటీవల విక్రమ్ చేసిన ప్రయోగాలన్నీ కూడా విఫలం అయ్యాయి. తంగలాన్ అంటూ విచిత్ర ప్రయోగం చేసి చాలా కష్టపడ్డాడు. కాని ఆ సినిమాకి రావల్సినంత గుర్తింపు రాలేదు, మూవీ కూడా సక్సెస్ కాలేదు. అయితే తాజాగా విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ వీర ధీర శూరన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో వీర ధీర శూర అనే టైటిల్‌తో వచ్చింది. అయితే ఈ రోజు ఉదయం థియేటర్లలో విడుదల కావలసిన ఈ సినిమాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.
విడుదలపై మధ్యంతర నిషేధం విధించడంతో ఉదయం 9 గంటలకు పడాల్సిన షోలు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ‘వీర ధీర శూర పార్ట్ 2’ చిత్రాన్ని హెచ్.ఆర్ పిక్చర్స్ పతాకం మీద రియా శిబు ప్రొడ్యూస్ చేయగా, ఈ మూవీ రిలీజ్ మీద స్టే కోరుతూ ముంబైకు చెందిన ప్రొడక్షన్ కంపెనీ బీ4యు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. చిత్ర నిర్మాణ సంస్థ తమకు శాటిలైట్ హక్కులను విక్రయించిందని, అయితే ఒప్పందం ప్రకారం విడుదలకు ముందు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటిటి) హక్కులను విక్రయించకూడదు. కాని దానిని ఉల్లంఘిస్తూ నిర్మాత డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మేశారని తమ పిటిషన్ లో పేర్కొంది.దీంతో మూవీ రిలీజ్ మీద మధ్యంతర నిషేదం విధించింది. పివిఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఉదయం 9 గంటలకు షెడ్యూల్ చేసిన షోలు అన్నిటినీ క్యాన్సిల్ చేశారు.
ఓవర్సీస్లో షోలు కూడా పడాల్సి ఉంది. కానీ అక్కడ షోలు క్యాన్సిల్ అయ్యాయ్ అని సమాచారం.గురువారం వీరధీరశూర పార్ట్ 2 రిలీజ్ కాగా, బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ప్రమోషన్లు కూడా అంతగా జరగలేదు. ఒక రోజు విక్రమ్ టీమ్ వచ్చి మీడియాని కలిసి, ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్లిపోయారు. తమిళంలో కూడా బుకింగ్స్ అంతగా ఏమి లేవు. వీర ధీర శూర సినిమా వస్తున్నట్టుగా మాకు తెలీదే అంటూ కొంత మంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు షాక్ ఇవ్వడానికి ముందు కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ టికెట్స్ కొన్నవారే కరువయ్యారు. అసలు విక్రమ్ మూవీకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అందరు ముచ్చటించుకుంటున్నారు.