Vedam Movie | 2010లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన క్లాసిక్ ఫిల్మ్ ‘వేదం’ ప్రేక్షకుల మనసుల్లో ఎంతగా నిలిచిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క లు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అప్పట్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, కాలక్రమంలో అది ఒక కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ సినిమాలోని పాత్రలు హీరోల కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాదని అందరూ భావించారు. ఎందుకంటే సినిమా క్లైమాక్స్‌లో బన్ని (కబీర్) మరియు మనోజ్ (విజయ్) పాత్రలు మరణిస్తాయి. కానీ తాజాగా, డైరెక్టర్ క్రిష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదం 2 గురించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఘాటి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ.. “వేదం క్లైమాక్స్‌లో అనుష్క ట్రైన్ ఎక్కుతుంది.బయట వర్షం పడుతుంది. జీవితం మీద ఆశ ఉంది అన్నట్టు ముగింపు ఉంటుంది. అయితే అప్పుడే సరోజ పాత్రకి సీక్వెల్ ప్లాన్ చేయాలని అనుకున్నాను. తిలక్ గారు రాసిన ‘ఊరి చివర ఇల్లు’ అనే నవలలో ‘రమ’ అనే వేశ్య పాత్ర నన్ను చాలా ఆకట్టుకుంది. దాన్ని ప్రేరణగా తీసుకుని, సరోజ పాత్ర ఆధారంగా ఓ గొప్ప లవ్ స్టోరీ రాసాను. అనుష్కకు కథ చెప్పగానే ఆమె చాలా ఇష్టపడింది. అప్పటి నుంచి ఎప్పుడూ అడుగుతుంటుంది – ‘సరోజ సినిమా ఎప్పుడు?’ అని. కానీ దానికి సరైన సమయం కావాలి.”
క్రిష్ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది – ఈసారి ‘వేదం 2’ ఒక డైరెక్ట్ సీక్వెల్ కాకపోయినా, అనుష్క పోషించిన “సరోజ” పాత్ర ఆధారంగా కొత్త కథగా తెరకెక్కనుంది. అదే ‘సరోజ’ అనే టైటిల్‌తో వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సినిమాలో అనుష్క మళ్లీ వేశ్య పాత్రలో నటిస్తుండగా, కథ మొత్తం ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా మలచబడనుందన్న విషయం కూడా ఆయన చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు అసలైన ప్రశ్న.. ఈ సరోజ కథ ఎప్పుడు తెరపైకి వస్తుంది? అనేది. క్రిష్, అనుష్క ఇద్దరూ బిజీగా ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఈ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.