‘ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్ చాలా బాగుంది. టీజర్ చూస్తుంటే సినిమా హిట్ గ్యారెంటీ అనే నమ్మకం కలుగుతున్నది. హీరో చేనాగ్ స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘వేద’ చిత్ర టీజర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ ‘దర్శకుడు జేడీ నా బాల్య మిత్రుడు. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఈ సినిమాలో నాలుగు పాటలు రాశాను. నా మిత్రుడు పరిశ్రమలో పెద్ద దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ‘సైకో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమాలో చూపించే అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తాయి’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఏడుగురు నిర్మాతల భాగస్వామ్యంలో ఈ సినిమాను రూపొందించామని, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లో నటించడం ఆనందంగా ఉందని హీరో చేనాగ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్, సాహిత్యం: చంద్రబోస్, నిర్మాతలు: జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్, శ్రీనివాస్, రాజేందర్ కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జేడీ స్వామి.