భిన్నమైన చిత్రాలకు కేరాఫ్ వరుణ్ తేజ్. ఆయన నటించిన ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘గద్దలకొండ గణేష్’ ‘ఎఫ్2’ ..వంటి చిత్రాలన్నీ వెరైటీ జోనర్స్‌తో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వరుణ్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం ‘గని’. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. జీరో నుంచి హీరోగా ఎదిగేందుకు ఒక బాక్సర్ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఈ నెల 8న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు వరుణ్ తేజ్.
స్పోర్ట్స్ డ్రామా ఆలోచన నాదే..
‘మిస్టర్’ సినిమా నుంచి దర్శకుడు కిరణ్ నాకు పరిచయం. ఆ తర్వాత ‘తొలిప్రేమ’కు పనిచేశాడు. కలిసి సినిమా చేయాలని అనుకున్నప్పుడు బాక్సింగ్ నేపథ్యంతో సినిమా బాగుంటుందని నేనే చెప్పాను. హాలీవుడ్, బాలీవుడ్లో స్పోర్ట్స్ డ్రామాలు ఎక్కువగా వస్తుంటాయి. నేను ఆ చిత్రాలను బాగా చూస్తాను. ఇంగ్లీష్‌లో ‘రాకీ’, ‘మిలియన్ డాలర్ బేబి’, హిందీలో ఫర్హాన్ అక్తర్ ‘బాగ్ మిల్కా బాగ్’, ‘చక్ దే ఇండియా’ వంటివి నా ఫేవరేట్ మూవీస్. కళ్యాణ్ బాబాయ్ ‘తమ్ముడు’ సినిమా చేశారు, అలాగే శ్రీహరి ‘భద్రాచలం’ సినిమాలో నటించారు. ఇవన్నీ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామాలు. తెలుగులో ఇలాంటివి ఇంకా రావాలని నాకు అనిపించేది.
అనుకున్నంత సులువుకాదు
సినిమాల్లో ఫైట్స్ చేస్తుంటాం కాబట్టి బాక్సింగ్ కూడా అలాగే ఉంటుందని ముందు అనుకున్నా కానీ సెట్స్ లోకి వెళ్లినప్పుడు అంత సులువు కాదని తెలిసింది. ఎదుటి వ్యక్తితో ఆపకుండా పోరాడాలి. రెండు చేతులకూ విశ్రాంతి ఉండదు. శరీరాకృతిని దృఢంగా ఉండేలా చూసుకోవాలి.
గని మొండివాడు..
సినిమా రెండు భాగాల్లో నా క్యారెక్టర్ రెండు విధాలుగా ఉంటుంది. తొలి భాగంలో గని మొండిగా తన లక్ష్య సాధన వైపు దూసుకెళ్తాడు. కానీ అతనికి సరైన మార్గదర్శకత్వం ఉండదు. ద్వితీయార్థంలో ఆ గైడెన్స్ దొరుకుతుంది. అప్పుడు గని పరిణితితో ముందుకు సాగుతాడు. ఆరు ప్రధాన పాత్రల మధ్య గని సినిమా సాగుతుంది.
ఆ ఇద్దరితో మల్టీస్టారర్స్ చేస్తా
‘ఎఫ్2’లో వెంకటేష్‌తో కలిసి నటించాను. కథ బాగుంటే మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు సిద్ధమే. నాకు సాయిధరమ్ తేజ్ బాగా క్లోజ్. చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరిగేవాళ్లం. నితిన్ కూడా మంచి మిత్రుడే. వీళ్లిద్దరిలో ఎవరితోనైనా మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రెడీ. ‘గని’ చూసిన వాళ్లు ‘ఎఫ్3’ చూస్తే రెండూ వేటికవి కొత్తగా అనిపిస్తాయి.
తదుపరి సినిమాలు..
‘ఎఫ్ 3’ రిలీజ్‌కు రెడీ అవుతున్నది, దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేయబోతున్నాను. ఇది మే నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది. ‘గని’ దర్శకుడు కిరణ్‌కు ఓ సినిమాకు అడ్వాన్స్ ఇచ్చాను. ఇందులో నేనే నటిస్తానా మరొక హీరోనా చూడాలి. అలాగే మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.