Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ–ఫాంటసీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై క్రేజ్‌ను మరింత పెంచింది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘VT15’ ప్రాజెక్ట్ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేయగా, అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ తొలిసారిగా హారర్ ఫాంటసీ జానర్లో అడుగుపెడుతున్నారు. గ్లింప్స్‌లో ఆయన మాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విదేశాల్లోని ఒక పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే సన్నివేశంలో, కమెడియన్ సత్యను పోలీసులు కొడుతుండటం, ఆ సమయంలో కామెడీ ట్రాక్ నడుస్తూనే హీరో స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులకు హుషారును కలిగిస్తోంది. ‘వీడు మన కనకరాజు కాదమ్మీ’ అంటూ సత్య చెప్పే డైలాగ్‌కు, ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ వరుణ్ తేజ్ కొరియన్ భాషలో ఇచ్చే కౌంటర్ ప్రత్యేకంగా హైలైట్ అవుతోంది. ఈ సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి తులసి, కమెడియన్ సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ స్థాయిలో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సంగీతానికి లెజెండరీ కంపోజర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వరుణ్ తేజ్ – తమన్ కాంబోలో గతంలో వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ కావడంతో, ఈ సినిమాపై కూడా మ్యూజిక్ పరంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను సమ్మర్ సీజన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుణ్ తేజ్‌కు సరైన కమర్షియల్ హిట్ పడకపోవడంతో, ‘కొరియన్ కనకరాజు’తో ఆయన బలమైన కమ్‌బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలను మేళవిస్తూ రూపొందుతున్న ఈ సినిమా, వరుణ్ తేజ్ కెరీర్లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందేమో అన్న అంచనాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.