Varun Tej- Lavanya Tripathi | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ క్రేజీ జంటలలో ఒకటి. వీరిద్దరు సీక్రెట్‌గా కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. నవంబర్ 1, 2023లో వారిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకు తమ ప్రేమ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన ఈ జంట సడెన్‌గా తమ నిశ్చితార్థం విషయాన్ని ప్రకటించి అనంతరం పెళ్లి పీటలెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా నటించారు అనంతరం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం అనే సినిమా చేశారు. ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి అది ప్రేమ వరకు వెళ్లింది. కానీ చాలా రోజులు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగానే ఉంచారు.
కొద్ది రోజుల క్రితం ఈ జంట ఓ గుడ్ న్యూస్ అందించారు. తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామంటూ ఇన్ స్టాలో వరుణ్ తేజ్ చెప్పడతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడంటూ అభిమానులు తెగ సందడి చేశారు. అయితే కొద్ది సేపటి క్రితం లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ రోజు ఉదయం రెయిన్ బో ఆసుపత్రిలో లావణ్య ప్రసవించినట్టు తెలుస్తుంది. విషయం తెలియగానే చిరంజీవి కూడా మన శంకర వరప్రసాద్ సెట్ నుండి డైరెక్ట్‌గా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలని కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి మెగా వారసుడు రావడంతో కుటుంబ సభ్యుల ఆనందం హద్దులు దాటింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల లావణ్య త్రిపాఠి సినిమాలు తగ్గించింది. వరుణ్ తేజ్ 2023లో ‘గాండీవధారి అర్జున’, గతేడాది ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ సినిమాలతో సినీ ప్రియులని పలకరించాడు. ఇవి ప్లాప్ లు గా నిలిచాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ‘VT-15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది.