వరుణ్‌సందేశ్, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ పాడిన పాటను ఇటీవల పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని, చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు అందరికి స్ఫూర్తినిస్తారని, అలాంటి కానిస్టేబుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు. దాదాపు 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, నైజాంలో ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతున్నదని నిర్మాత బలగం జగదీష్ తెలిపారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్నందిస్తున్నారు.