Varun Tej | కంచె, తొలిప్రేమ, గద్దలకొండ గణేశ్, ఫిదా.. ఒకదానికొకటి సంబంధం లేని జానర్లను ఎంచుకుంటూ అభిరుచి గల నటుడిగా ఎదిగారు వరుణ్‌తేజ్. ప్రస్తుతం ఆయన కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తరువాత సినిమాకోసం కథల్ని కూడా వింటున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన కథను వరుణ్ ఓకే చేశారట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మేర్లపాక గాంధీ. క్రైమ్ కామెడీ కథల్ని తెరకెక్కించడంలో ఆయన దిట్ట. వరుణ్‌కోసం రాసుకున్న కథ కూడా అదే జానర్లో ఉంటుందని సమాచారం. ‘మట్కా’ తర్వాత వరుణ్ నటించే సినిమా ఇదేనని ఇన్సైడ్ టాక్.