Varanasi | టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టిస్తుంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారణాసి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ భారీ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ప్రత్యేక మీడియా సమావేశంలో పాల్గొన్న రాజమౌళి, మహేష్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సినిమా కథ నేపథ్యం, భావోద్వేగం, కథలోని ప్రధాన అంశాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల రాజమౌళి చిత్రాలకు సీక్వెల్స్, ఫ్రాంచైజీలపై విస్తృత చర్చ జరుగుతోంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు కొనసాగింపులు వస్తాయనే ప్రచారం నడుస్తున్న సమయంలో, ‘వారణాసి’ మాత్రం ఒకే భాగంలో ముగిసే పూర్తి కథ అని రాజమౌళి స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం ఎలాంటి సీక్వెల్ లేదా ఫ్రాంచైజీ ప్రణాళికలు లేవని, ఇది పూర్తిస్థాయి స్టాండ్అలోన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెలిపారు. సినిమా కథ నేపథ్యంపై స్పందించిన రాజమౌళి, ‘వారణాసి’ని కేవలం అడ్వెంచర్ మూవీగా చూడకూడదని అన్నారు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలను చూపించే విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు భారతీయ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు.
ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికాలోని మంచు ప్రాంతాల వరకు ప్రేక్షకులు ఓ అద్భుతమైన ప్రయాణాన్ని అనుభవిస్తారు. రామాయణంలోని పురాణ అంశాలు, ప్రకృతి విపత్తులు, ఫాంటసీ ఎలిమెంట్స్, సాహస యాత్రలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అయితే ఈ కథకు మూలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన భావోద్వేగమే అని రాజమౌళి వివరించినట్లు సమాచారం. సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్నప్పటికీ, దాని హృదయం మాత్రం భారతీయ కుటుంబ భావోద్వేగాలేనని రాజమౌళి తెలిపారు. ప్రపంచ స్థాయి విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మధ్య ఒక తండ్రీకొడుకుల అనుబంధం కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో మహేష్ బాబు అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు కేవలం అడ్వెంచర్ మూవీగా భావించిన ఈ ప్రాజెక్ట్‌లో బలమైన భావోద్వేగం కూడా ఉండబోతుందని తెలిసి అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.