Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భారీ సెట్లు నిర్మించారు. ముఖ్యంగా రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్ ప్రాంతంలో వేసిన సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో భాగంగా నీటి అడుగున జరిగే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారట. ఇందుకోసం భారీ స్థాయిలో నీరు అవసరమవుతుందని, దాదాపు 10 వేల లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయాలని నిర్మాణ సంస్థ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఎండలు తీవ్రంగా ఉండటం, నగరంలో నీటి డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ అభ్యర్థనను వాటర్ బోర్డ్ తిరస్కరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. సరఫరా చేసే నీటిని శుద్ధి చేసి వినియోగించుకోవాలని, ట్యాంకర్ ఛార్జీలను నిర్మాతలే భరిస్తారని లేఖలో పేర్కొన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి నీటిని అందించడం సాధ్యం కాదని అధికారులు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. ఇక మరోవైపు మహేష్ బాబు ఇటీవల జర్మనీకి వెళ్లి బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్, ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, మే 18 నుంచి అండర్‌వాటర్ సన్నివేశాల షూటింగ్ చేపట్టాలని చిత్రబృందం యోచిస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం పోషిస్తుండగా, ‘రుద్ర’ మరియు ‘శ్రీరాముడు’ పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథను విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ భారీ చిత్రం గురించి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నీటి వివాదం నిజమా కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.