Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటిన రాజమౌళి.. ఈసారి మరింత భారీ కాన్వాస్‌తో ప్రపంచ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారు. దాదాపు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.‘వారణాసి’ని ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో, 50కి పైగా అంతర్జాతీయ, ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంత భారీ స్థాయిలో సినిమాను వివిధ భాషల్లోకి తీసుకెళ్లే విషయంలో రాజమౌళి ప్రత్యేకమైన విధానాన్ని ఎంచుకున్నారట.
ప్రస్తుతం సినిమాల డబ్బింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ క్లోనింగ్ వంటి టెక్నాలజీలను ఉపయోగించడం పెరుగుతోంది. అయితే ‘వారణాసి’ విషయంలో మాత్రం రాజమౌళి ఈ విధానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నటీనటుల గొంతులోని సహజత్వం, భావోద్వేగాలు, డైలాగ్ డెలివరీలోని తీవ్రత ప్రతి భాషలోనూ ప్రేక్షకులకు సరిగ్గా చేరాలంటే స్థానిక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులే కీలకమని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఆయా భాషలకు సంబంధించిన ఉచ్చారణ, స్థానిక యాస, సంస్కృతికి అనుగుణంగా డైలాగ్స్‌ను రికార్డ్ చేయనున్నారని తెలుస్తోంది.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి ప్రధాన నటుల నటనలోని ఎమోషన్ ఏ భాషలో చూసినా ప్రేక్షకులకు సహజంగా అనిపించేలా ఈ డబ్బింగ్ ప్రక్రియను డిజైన్ చేస్తున్నారట. 50కి పైగా భాషల్లో ఇంత భారీ సంఖ్యలో డబ్బింగ్ ఆర్టిస్టులతో పనిచేయడం భారతీయ సినిమా స్థాయిలో అరుదైన ప్రయత్నంగా మారనుంది. వారణాసి కథాంశం కూడా అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తున్న ఓ భారీ ఉల్క వల్ల ఏర్పడే ప్రమాదం నుంచి వారణాసితో పాటు ప్రపంచాన్ని రక్షించే సాహసోపేతమైన కథతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. మహేష్ బాబు ఇందులో ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనుండగా.. కథలో భాగంగా వివిధ కాలాల మధ్య ప్రయాణించే సాహసికుడిగా ఆయన పాత్ర ఉండబోతుందని టాక్. భారతీయ పురాణాలు, సనాతన సంస్కృతి అంశాలను ఆధునిక గ్లోబల్ అడ్వెంచర్ కథతో కలిపి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వారణాసి’ షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా, ఆఫ్రికాలోని కెన్యా తదితర ప్రాంతాల్లో జరిగింది. అంతేకాదు.. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది