Varanasi | టాలీవుడ్లో రాజమౌళితో సినిమా చేయాలని కోరుకోని హీరో ఉండరు. ఆయన సినిమాలు అంటే గ్లోబల్ రేంజ్, అంతర్జాతీయ గుర్తింపు గ్యారంటీ. అయితే ఆ క్రేజ్ వెనుక ఉన్న కఠినమైన కృషి గురించి ఇండస్ట్రీకి బాగా తెలుసు. పర్ఫెక్షన్ కోసం నటీనటులను పిండేయడమే జక్కన్న స్టైల్. ఇదే విషయాన్ని గతంలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సరదాగా పలుమార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే దశలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగుపెడుతున్నారు. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది మహేష్ కెరీర్లోనే కాకుండా రాజమౌళి ఫిల్మోగ్రఫీలో కూడా మరో భారీ ప్రాజెక్ట్‌గా తయారవుతోంది.
ఇప్పటికే బయటికొచ్చిన సమాచారం ప్రకారం, మహేష్ బాబు ఈ సినిమాలో ఏకంగా 5 విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారట. అందులో రాముడు, రుద్రుడు కీలక పాత్రలుగా ఉండగా, మిగిలిన మూడు పాత్రలు కూడా కథకు ముఖ్యమైన వేరియేషన్స్ అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో మహేష్ బాబు ద్విపాత్రాభినయం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఐదు పాత్రలు అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రతి పాత్రకు భిన్నమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్, మైండ్‌సెట్, ఎమోషనల్ రేంజ్ ఇవి అన్నింటినీ పర్ఫెక్ట్గా చేయాల్సి వస్తోంది. రాజమౌళి ఒకే సీన్ కోసం వంద టేకులు తీస్తారనే విషయాన్ని ఇండస్ట్రీ బాగా తెలుసు. ఇప్పుడు ఐదు పాత్రలు ఉంటే మహేష్ బాబు పడాల్సిన కష్టం ఎలా ఉంటుందో అని మహేష్ ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ గెటప్స్ కోసం మహేష్ శారీరకంగా కూడా పలు మార్పులు చేసుకుంటున్నారు. రుద్ర లుక్ కోసం జుట్టు పెంచడం, మసిల్స్ పెంచి కొత్త లుక్‌లో కన్పించడం, రాముడి పాత్ర కోసం స్లిమ్ లుక్‌లోకి మారడం, ఇంకా మిగిలిన పాత్రల కోసం ఎంత కష్టం పడాల్సి వస్తుందని అంటున్నారు. సుమారు ₹1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి పడింది. అందుకే రాజమౌళి ఒక్క విషయంలో కూడా రాజీ పడడం లేదు. మహేష్ బాబు కూడా దర్శకుడు చెప్పిన ఒక్క సూచనను కూడా మిస్ కాకుండా అమలు చేస్తున్నారట. మహేష్ బాబు చేస్తున్న ఈ ఐదు గెటప్స్ కథలో ఏ విధంగా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయి?ఈ పాత్రల వెనుక రాజమౌళి ఏ మ్యాజిక్ దాచిపెట్టాడు? అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ప్రేక్షకులంతా కొంతకాలం ఆగాల్సిందే.