Varanasi |టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి (Varanasi)’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్–అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ వీడియో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అదే సమయంలో ‘వారణాసి’ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా, రాజమౌళి స్వయంగా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7, 2027న ‘వారణాసి’ థియేటర్లలోకి రానుందని తెలిపారు. అయితే, ఈ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదలైన వెంటనే అభిమానుల్లో ఓ కొత్త సందేహం మొదలైంది. అదేంటంటే… ‘వారణాసి’ సినిమాను రాజమౌళి రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడా? అన్న ప్రశ్న. దీనికి కారణం కూడా లేకపోలేదు. టైటిల్ వీడియో రిలీజ్ సమయంలో విడుదల చేసిన పోస్టర్లో #GlobeTrotter మరియు #TimeTrotter అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లు కనిపించాయి. కానీ తాజాగా వచ్చిన రిలీజ్ డేట్ పోస్టర్లో మాత్రం కేవలం #GlobeTrotter మాత్రమే ఉంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
పార్ట్ 1లో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా (Globe Trotter) కనిపిస్తాడని, పార్ట్ 2లో కాలాల్ని దాటి ప్రయాణించే ధీరుడిగా (Time Trotter) అవతరిస్తాడని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి సినిమాలంటే కథతో పాటు ప్రమోషన్లలోనూ ప్రత్యేకత ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే, కావాలనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేందుకు, సెకండ్ పార్ట్‌కు హింట్ ఇచ్చేలా ఈ హ్యాష్‌ట్యాగ్‌లను ప్లాన్ చేశాడేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. ‘బాహుబలి’ తరహాలోనే ‘వారణాసి’ కూడా రెండు పార్టులుగా వస్తే, అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులకు బాటలు వేయడం ఖాయం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ‘వారణాసి’ రెండు పార్టులా? లేక ఇది కేవలం జక్కన్న స్ట్రాటజీనా? అన్నది మాత్రం మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనతోనే క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఈ మిస్టరీపై చర్చలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.