టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటబడుతున్నాయి. సత్యనారాయణ రావు, చలపతిరావు మరణ వార్తలు మరువకముందే మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ మరణించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా అపోలో ఆస్పత్రిలో చేరాడు. కాగా చికిత్స పొందుతూనే జనార్దన్ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఏలూరులోని పోతునూరి గ్రామంలో జన్మించిన వల్లభనేని జనార్దన్‌కు తొలినాళ్ల నుండి సినిమాలంటే ఎంతో ఆసక్తట. దాంతో డిగ్రీ పట్టా చేతికందుకోగానే చిత్ర పరిశ్రమకు పరుగులు పెట్టాడు. సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ‘మామ్మగారి మనవలు’ అనే సినిమాను ప్లాన్ చేశాడు. కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రమోహన్‌తో ‘అమాయక చక్రవర్తి’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దర్శకుడిగా వల్లభనేనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగాను ‘శ్రీమతి కావాలి’, ‘పారిపోయిన ఖైదీలు’, ‘మహాజనానికి మరదలు పిల్ల’, ‘నీకోసం’ వంటి పలు సినిమాలను నిర్మించాడు. ఇక మోహన్‌బాబుతో ‘శ్రీమతి కావాలి’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఓ పాత్ర కోసం అనుకున్న ఆర్టిస్టు రాకపోవడంతో.. తనే నటుడిగా మారి ఆ పాత్రను పోషించాడు.
విజయ బాపినీడు దర్శకత్వం వహించిన అనేక సినిమాల్లో వల్లభనేని నటుడిగా రాణించాడు. చిరంజీవితో విజయ బాపినీడు తెరకెక్కించిన ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో సుమలత తండ్రిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలందరితో కలిసి వెండితెర పంచుకున్నాడు. నాగార్జునతో ‘వారసుడు’, వెంకటేష్‌తో ‘సూర్య ఐపీఎస్’, బాలకృష్ణతో ‘లక్ష్మీ నరసింహా’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వలభనేని ఇప్పటి వరకు దాదాపు 120 సినిమాల్లో నటించాడు.