e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News Konda Polam movie Review | కొండపొలం రివ్యూ

Konda Polam movie Review | కొండపొలం రివ్యూ

కొండ పొలం సినిమా రివ్యూ | Konda Polam movie Review | Vaishnav tej | rakul preet singh | krish | tollywood
Konda Polam movie Review | కొండ పొలం సినిమా రివ్యూ కొండపొలం మూవీ రివ్యూ

Konda Polam movie Review | సినిమా : కొండపొలం ; తారాగణం: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌ తదితరులు ; సంగీతం: ఎం.ఎం.కీరవాణి ; సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌ ; నిర్మాణ సంస్థ: ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ; కథ: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి; దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి

నవలా ఇతివృత్తాల్ని తీసుకొని సినిమా చిత్రణ చేయడం ఒకప్పుడు విరివిగా జరిగేది. నవలా కథాంశాలతో తెరకెక్కి అద్భుత విజయాలు అందుకున్న సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా నవలా సాహిత్యాన్ని వెండితెర మీదకు తీసుకొచ్చే ధోరణి తగ్గిపోయింది. కొండపొలం ( Konda Polam ) సినిమాతో తిరిగి ఆ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు టాలీవుడ్ ( Tollywood ) దర్శకుడు క్రిష్ ( krish ). సినిమా ద్వారా మానవీయ విలువల పరిరక్షణ, సామాజిక సందేశం ఆవిష్కృతం కావాలని తపించే దర్శకుల్లో క్రిష్‌ ఒకరు. తెలుగు సాహిత్యంపై మమకారం, విస్త్రతమైన అవగాహన కలిగిన ఆయన విశేష పాఠకాదరణ పొందిన రాయలసీమ నేపథ్య కొండపొలం నవలను కథాంశంగా తీసుకొని అదే పేరుతో సినిమాను తెరకెక్కించారు. నవల రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని సినిమా రచనలో భాగం చేస్తూ సంభాషణలు రాయించారు. చాలా విరామం తర్వాత తెలుగులో వచ్చిన నవలా చిత్రం కొండపొలం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథ..

- Advertisement -

కొండపొలం సినిమా కథ గురించి ప్రచార కార్యక్రమాల్లోనే వెల్లడించారు. గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన రవీంద్రనాథ్‌ ( వైష్ణవ్‌ తేజ్‌ Vaishnav Tej ) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. పల్లెటూరి నేపథ్యం కావడం.. ఆత్మన్యూనతా భావనతో బాధపడుతుండటంతో ఉద్యోగ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవు. దీంతో తిరిగి తన ఊరెళ్లిపోతాడు. తన గ్రామంలోని వర్షాభావ పరిస్థితుల వల్ల గొర్రెల్ని మేపడం తండ్రి గురప్ప ( సాయిచంద్‌ )కు కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కోసం మరికొంత మంది గొర్రెల కాపరులతో కలిసి మందలను తోలుకొని నల్లమల అరణ్యంలోకి కొండపొలం వెళ్తారు. వారికి తోడుగా కొడుకు రవీంద్రనాథ్‌ వెళ్తాడు. అదే గ్రామానికి చెందిన ఓబులమ్మ ( రకుల్‌ Rakul Preet Singh )కూడా తన గొర్రెల మందతో వీరికి తోడవుతుంది. ఈ బృందానికి అడవిలో ఎదురైన పరిస్థితులు, ఎన్నో ప్రతికూలతల నడుమ బతుకు పోరును సాగించిన వైనం ఏమిటన్నది తెరపై చూడాల్సిందే.

కొండ పొలం సినిమా రివ్యూ | Konda Polam movie Review | Vaishnav tej | rakul preet singh | krish | tollywood
Konda Polam movie Review | కొండ పొలం సినిమా రివ్యూ కొండపొలం మూవీ రివ్యూ

కథా విశ్లేషణ..

సుదూరంగా కనిపించే అరణ్యం హరితశోభతో కళకళలాడుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ..ఆ అడవి గర్భంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అక్కడ ప్రతిక్షణ బతుకు పోరాటమే అనే అంశాల్ని బలమైన తాత్వికత మేళవించి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్రిష్‌. అడవిలో గొర్రెల మందలతో వెళ్లిన రవీంద్రనాథ్‌ బృందానికి అక్కడి క్రూర మృగాల నుంచే కాకుండా అడవిని చెరబట్టే విధ్వంసకర శక్తుల నుంచి ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వాటిపై అతిసాధారణ మనుషులు, నిరాయుధులైన గొర్రెలకాపరులు ఎలా పోరాటం, ఈ క్రమంలో వారిలో జరిగే సంఘర్షణను హృద్యంగా, ఉత్కంఠగా ఆవిష్కరించారు. ప్రథమార్థంలో కథానాయకుడు రవీంద్రనాథ్‌లో జరిగే పరివర్తనను అర్థవంతంగా తెరపై తీసుకొచ్చారు. స్వతహాగా భయస్తుడైన రవీంద్రనాథ్‌ అడవిలో జరిగిన కొన్ని సంఘటనలతో భయాన్ని ఎలా జయించాలో తెలుసుకుంటాడు. అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లతో..గొర్రెల దొంగలతో చేసిన పోరు అతనిలో తెలియని ధైర్యాన్ని ప్రోదిచేస్తుంది. బతకాలంటే ప్రమాదాలకు ఎదురీదాలనే నిజాన్ని తెలుసుకుంటాడు.

ద్వితీయార్థంలో కథను మరింత వేగంగా నడిపించారు. పులిని ఎదిరిస్తూ చేసే పోరాటఘట్టాలు ఉత్కంఠను పంచుతాయి. అయితే పులి తాలూకు గ్రాఫిక్స్‌ వర్క్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేదనిపిస్తుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యతనిస్తూ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. కొండపొలం అనే సాహసయాత్ర నేపథ్యంలో అడవిని, ప్రకృతి సంపదను పరిరక్షించుకోవాలనే అంతర్లీన సందేశం ఆకట్టుకుంటుంది. అడవిలో సాహసయాత్రకు బయలుదేరిన యువకుడు తిరిగి అదే అడవికి ఫారెస్ట్‌ అధికారిగా రావడం, అతనిలో పరివర్తన తీసుకొచ్చిన అంశాలను చక్కగా ఆవిష్కరించారు. అయితే ‘కొండపొలం’ నవలలో లేని ఓబులమ్మ పాత్రకు సినిమా కోసం సృష్టించారు. వాణిజ్య అంశాలను బేరీజు వేసుకొని ఆ పాత్రను తీసుకొచ్చారనే భావన కలుగుతుంది. అయితే నాయనాయికల మధ్య ప్రేమకథను అందంగా ఆవిష్కరించడం మెప్పిస్తుంది.

కొండ పొలం సినిమా రివ్యూ | Konda Polam movie Review | Vaishnav tej | rakul preet singh | krish | tollywood
Konda Polam movie Review | కొండ పొలం సినిమా రివ్యూ కొండపొలం మూవీ రివ్యూ

ఈ సినిమా ద్వారా అడవి పట్ల ప్రేమను చూపిస్తూనే మనిషి భయాల్ని జయించాలనే ఓ సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు దర్శకుడు క్రిష్‌. అడవి నేపథ్యంలో ఇలాంటి కథాంశాలు రావడం భారతీయ సినిమాలో చాలా అరుదనే చెప్పొచ్చు. ముఖ్యంగా దట్టమైన అడవిలో చిత్రీకరణ చేయడం..గొర్రెల మందల నేపథ్యంలో సన్నివేశాల్ని చిత్రించడం దర్శకుడికి సినిమా పట్ల తపనను తెలియజేస్తుంది. ‘అడవి పెద్ద బాలశిక్ష..ఇక్కడ ప్రతి చెట్టుకు, పుట్టకు ఓ కథ ఉంటుంది’ ‘నిటారుగా నిలబడ్డ మనిషిని చూసి పులి అడుగులు వెనక్కి వేసింది’ వంటి సంభాషణలు బాగున్నాయి. ఈ సినిమాను ఓ వ్యక్తిత్వ వికాస పాఠంలా దర్శకుడు తీర్చిదిద్దాడనిపిస్తుంది.

నటీనటుల అభినయం

రెండో సినిమా అయినా తన నటనలో చక్కటి పరిణితి కనబరిచాడు వైష్ణవ్‌ తేజ్‌. పల్లెటూరి యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఓబులమ్మగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెప్పించింది. సాయిచంద్‌ తన పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. గురప్పగా సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన పాత్ర గుర్తుండిపోయేలా ఉంది. కోటా శ్రీనివాసరావు పాత్ర చిన్నదే అయినా తనదైన శైలితో మెప్పించారాయన. మిగతా నటీనటులందరూ తమ పరిధులు మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా..

ఇక సాంకేతికంగా అన్ని విభాగాలు బాగా కుదిరాయి. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫీ అడవి అందాల్ని చక్కగా బంధించింది. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. సంభాషణలన్ని చక్కటి రాయలసీమ యాసలో సహజంగా అనిపించాయి. తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసినా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదనిపిస్తుంది. ఓ నవలా ఇతివృత్తాన్ని కథగా ఎంచుకోవడం దర్శకుడు క్రిష్‌కున్న సాహిత్యాభిలాషను తెలియజేస్తుంది. తనదైన ఫిలాసఫికల్‌ పంథాలో ఈ సినిమాను ఆవిష్కరించారాయన. భవిష్యత్తులో మరిన్ని నవలలు వెండితెర దృశ్యమానం కావడానికి ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందని చెప్పొచ్చు.

కొండ పొలం సినిమా రివ్యూ | Konda Polam movie Review | Vaishnav tej | rakul preet singh | krish | tollywood

తీర్పు..

చాలా విరామం తర్వాత అడవి నేపథ్యంలో ఓ విభిన్నమైన చిత్రంగా కొండపొలం సినిమా నిలిచిపోతుంది. ఓ కొత్త కథను ప్రేక్షకులకు చెప్పాలనే దర్శకుడి ప్రయత్నం అభినందనీయం. అయితే వాస్తవ జీవన చిత్రణ వల్ల ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకపోవడంతో సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్‌ చేసుకుంటారో, బాక్సాఫీస్‌ ఫలితం ఏ విధంగా ఉండబోతుందన్నది తెలియాలాంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే. మొత్తంగా ‘కొండపొలం’ చిత్రాన్ని ఓ ప్రయోజనం, పరమార్థం ఉన్న సినిమాగా పేర్కొనవచ్చు.

రేటింగ్‌: 3/5

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Chiranjeevi: కుటుంబంతో క‌లిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?

Rakul Preet Singh | కొండపొలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రకుల్ ప్రీత్ సింగ్

Vaishanv Tej: కొండ పొలం మేకింగ్ వీడియో అంచ‌నాలు రెట్టింపు చేసిందిగా..!

మాటల్లో చెప్పలేని అనుభూతి: రకుల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement