Vaishnav Tej | ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాలిడ్ హిట్‌తో మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కాలనే పట్టుదలతో ఉన్న ఈ యంగ్ హీరో, కథల ఎంపిక కోసం గత మూడు సంవత్సరాలలో ఏకంగా 100కు పైగా స్క్రిప్ట్‌లను తిరస్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఆదికేశవ ఇచ్చిన దెబ్బ వైష్ణవ్ మీదా చాలా పడింది.
అయితే ఎట్టకేలకు ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వైష్ణవ్ తేజ్ తన తదుపరి సినిమాను అధికారికంగా ఖరారు చేశారు. యువ దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన ఒక కథ ఈ యంగ్ హీరోను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘హంట్’ చిత్రానికి మహేష్ ఎస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో వరుస క్రేజీ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఆ వెంటనే సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఎంతో ఆలోచించి వైష్ణవ్ తేజ్ ఓకే చేసిన ప్రాజెక్ట్ కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.